Avva’s Stack of Grief | మావ్వ, దుక్కాల్ని దున్ని పోసుకున్న తొక్కుడు బండ

By and | 1 October 2016

మావ్వ దిగుట్లె దీపంగాదు
ఆకాశం గొంగట్ల ఆగమైన పొద్దు
నేలమ్మ కొంగున అంగిట బట్టిన ఆకలి
ఒక్కొక్క పువ్వుగాదు
వెయ్యేసి పూలేసినా
ఒక్క జాము నిండని సందమామ మా అవ్వ
సేతికి సెమటకు తీరని తెల్లారని గోస
రోట్లె తల్కాయ బెట్టి రోకటికి
ఎదురొడ్డిన తాలుగింజ బతుకు
కోడికూత పొద్దుల్ని ఆకిలూడ్సి
అలుకు జల్లి లేపేది
అడివిల ఆవొర్రది
ఇంటికాడ ల్యాగొర్రది
గుర్తింపులేని గులాపుది మా అవ్వ
బువ్వ వుడుకలేదని, మెత్తగైందని
కూలేది, నాలేది, పనేది, పాటేదని
అయ్య కోపాల కొలిమిలబడి
ఎన్నిసార్లు బస్మమైందో…
మా అందరికి మావ్వ వండిన కుండ వాల్సిన మంచమే.
నాగేటి సాల్లల్ల యిత్తునమై
మొలిసే మొలకంతా మా అవ్వే
మోకాటి బంటి మడుగుల
పొద్దంగినా నడుమెత్తని నాటై, కలుపై
ఎదిగే పచ్చని పైరంతా మా అవ్వే
పారబట్టి ఒడ్లుసెక్కినట్లు రాగాలు సెక్కి
పల్లెకు పాటలూదిందంతా మా అవ్వే
అవ్వ పనిల దిగితే సెమట తోడిన సెలిమయ్యేది
పొయిల సల్లారని పిడికె నిప్పయేది

నేనవ్వ కడుపును నడికట్టోలె సుట్టుకున్న
వెచ్చటి యాదులే లేవు
సేగబారి కాయలు గాసిన మా అవ్వ సేతిల
పాలబువ్వదిన్న సందమామ సంగతులే యెరుకలే…
పాలకేడ్సిన ఆకలి, సత్తుగిన్నెల రాత్రిబువ్వకాన్నే
సల్లారిన యాదులు సద్దుమనకలే….
అవ్వ పక్కల ఆవులించి ఆడుకున్న పొద్దులే లేవు

పలిగిన దప్పు మీది దరువు మా అవ్వ
బూమికి కాత పూత పంట ఫలం నేర్పి
తోలుకు తొండమై, దప్పై, చెప్పైన సెమటల్ల
సేదకు నోచని నాదము
ఆసామి, అయ్య సేతుల్ల
తాడును తప్పించుకునే బొంగురం తండ్లాట
బూమాతకు చాతిచ్చి బువ్వబెట్టినా
నాగలికి దూరం జేసిన నారాజులు
దుక్కాల్ని దున్ని పోసుకున్న తొక్కుడుబండ
మూటిడువని చరిత్రల ముల్లే,
కొంగు నడుముకు సుట్టి కొడవలెత్తిన సవాల్ మావ్వ
గీ లోకములున్న అక్షరాలు పాడువడ
మావ్వ తిరుగాడిన అంచులకే రాకపాయె
తెలంగాణలో తల్లిని అవ్వ అంటము.

This entry was posted in 76: DALIT INDIGENOUS and tagged , . Bookmark the permalink.

Related work:

Comments are closed.